చల్లారని రాఫెల్ సెగలు

సుప్రీం తీర్పు తర్వాత కూడా రాఫెల్ సెగలు చల్లారడం లేదు. రాఫెల్ ఒప్పందంపై కాగ్ నివేదికను పబ్లిక్ అక్కౌంట్స్ కమిటీకి, పార్లమెంటుకు సమర్పించామంటూ సుప్రీంలో కేంద్రం అవాస్తవాలు చెప్పిందని కాంగ్రెస్ మండి పడుతోంది. కాంగ్రెస్ అధినేత అయితే కేంద్రం ఏ పార్లమెంటుకు నివేదిక సమర్పించిందని నిలదీశారు. భారత పార్లమెంటుకా, ఫ్రాన్స్ పార్లమెంటు కా అని ఎద్దేవా చేశారు. రాఫెల్ డీల్ విషయంలో కేంద్రం ఎక్కడా పారదర్శకంగా వ్యవహరించలేదనీ, ఆఖరికి సుప్రీం కోర్టును కూడా తప్పుదోవపట్టించిందనీ విమర్శించారు.

ఇక లోక్ సభలో కాంగ్రెస్ పక్ష నేత, పీఏసీ చైర్మన్ మల్లిఖార్జున్ ఖర్గే అయితే తనకు తెలియకుండా కాగ్ నివేదికను పీఏసీకి ఎక్కడ, ఎలా సమర్పించారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక కాగ్ నివేదికను పబ్లిక్ డొమైన్ లో పెట్టామంటూ కేంద్రం పేర్కొనడాన్ని కూడా ఆయన తప్పు పట్టారు? ఎక్కడ పెట్టారు. అది చూసిన వారెవరైనా ఉన్నారా అంటే విమర్శల వర్షం కురిపించారు. కాగ్ నివేదికను పీఏసీకి సమర్పించామని పేర్కొన్న కేంద్రం అబద్ధాలతో మసిపూసి మారేడుకాయ చేసి రాఫెల్ వ్యవహారంలో క్లీన్ చిట్ పొందాలని చూస్తున్నదన్నారు.

ఈ విషయాన్ని పీఏసీ సభ్యుల దృష్టికి తీసుకెళతానని, అటార్నీ జనరల్, కాగ్ తమ ముందు హాజరు కావాల్సిందిగా సమన్లు జారీ చేస్తానని ఖర్గే అన్నారు. ఏది ఏమైనా పార్లమెంటులో సోమవారం నుంచీ రాఫెల్ సెగలు మరింత తీవ్రం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.