ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో సస్పెన్స్

Share

ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ లలో కాంగ్రెస్ పార్టీ విజయాలు నమోదు చేసినా సీఎం అభ్యర్థుల విషయంలో ఎటూ తేల్చుకోలేక మల్లగుల్లాలు పడుతోంది. బీజేపీని గద్దె దించడానికి ఇరు రాష్ట్రాలలోనూ కూడా తమతమ విభేదాలను పక్కన పెట్టి సమష్టిగా పని చేసిన ఆయా రాష్ట్రాల నేతలు సీఎల్పీనేత ఎన్నిక వచ్చే సరికి ఒకరితో ఒకరు పోటీపడుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. ఛత్తీస్ గఢ్ విషయానికి వస్తే రమణ్ సింగ్ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు సమైక్యంగా పని చేసిన అగ్రనేతలు ఇప్పుడు సీఎం పీఠం తమకంటే తమకని పోటీలు పడుతున్నారు. అధిష్టానం పరిశీలకుడిగా కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్ సభలో విపక్ష నేత మల్లిఖార్జున్ ఖర్గే వచ్చినా పీటముడి వీడలేదు. సీఎల్పీ సమావేశంలో ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించి రాహుల్ కు నివేదించారు. ఇక నిర్ణయం ఆయన చేతుల్లో ఉందని చెబుతున్నారు. మొత్తానికి ఛత్తీస్ గఢ్ లో సీఎం పదవి కోసం ప్రధానంగా టీఎస్ సింగ్ దేవ్, భూపేశ్ బాఘెల్ లు పోటీ పడుతున్నారు. వీరిలో టీఎస్ సింగ్ దేవ్ గత అసెంబ్లీలో విపక్ష నేత కాగా, భూపేష్ బాఘెల్ పీసీసీ చీఫ్. వీరిరువురిలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఎవరివైపు మొగ్గు చూపుతారన్నది సస్పెన్స్ గా మారింది.

ఇక రాజస్థాన్ విషయానికి వస్తే…కాంగ్రెస్ విజయం సాధించిన అసెంబ్లీ ఎన్నికలకు మించి ఇక్కడ సీఎం అభ్యర్థి కోసం పోటీ జరుగుతోంది. ఇక్కడ కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి పదవి కోసం  సచిన్ పైలట్, అశోక్ గెహ్లాలు గట్టిగా పోటీ పడుతున్నారు. ఎన్నికల ముందు అంతా సద్దుమణిగినట్లు కనిపించిన ఆధిపత్య పోరు ఇప్పుడు తెరపైకి వచ్చింది. సచిన్ పైలట్, అశోక్ గెహ్లాట్ ల మధ్య ఆదినుంచీ ఆధిపత్య పోరు ఉన్నప్పటికీ అధిష్టానం ఆదేశాల మేరకు అసెంబ్లీ ఎన్నికలలో విభేదాలను మరచి పని చేశారు. ఫలితాలు వెలువడిన అనంతరం ఇరువురూ కూడా తమ తమ పట్టు కోసం, సీఎం పదవి కోసం బలప్రదర్శనలకు కూడా దిగుతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అవినాశ్‌ పాండే, కేసీ వేణుగోపాల్‌ ను పంపింది. వారి సమక్షంలో కూడా ఇరువురు నేతలూ బలప్రదర్శనకు దిగారు. సీఎం పదవి తనకే దక్కాలంటూ ఇరువురూ గట్టిగా పట్టుబట్టారు. అదే సమయంలో అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం అంటూ బంతిని హైకమాండ్ కోర్టులోకి నెట్టారు. ఈ పరిస్థితులలో సీఎం ఎవరన్నది ఇంకా సస్పెన్స్ గానే ఉంది.


Share

Related posts

సుధాకర్ కేసు లో హై కోర్టు సాక్షిగా భారీ ట్విస్ట్ !

somaraju sharma

తీర్పుపై సున్నీ వక్ఫ్ బోర్డు అసంతృప్తి!

Siva Prasad

సుధీర్ రష్మీ ల మ్యారేజ్ ఎప్పుడో ఇన్నాళ్లకు బయట పెట్టిన రష్మీ

Naina

Leave a Comment