ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ హస్తగతం-మధ్యప్రదేశ్ లో హంగ్

ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పుంజుకుందనే చెప్పాలి. ఈ మూడు రాష్ట్రాలలోనూ అధికారంలో ఉన్న బీజేపీకి గట్టిపోటీ ఇవ్వడమే కాకుండా రెండు రాష్ట్రాలలె అధికారం హస్తగతం చేసుకునే దిశగా కొనసాగుతోంది. ఒక రాష్ట్రంలో మాత్రం ఫలితాలు ఇరు పార్టీల మధ్యా దోబూచులాడుతున్నాయి. ఇప్పటి వరకూ అందిన అంచనాల మేరకు ఛత్తీస్ గఢ్, రాజస్థాన్ లలో కాంగ్రెస్ అధికారం చేపట్టే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజస్థాన్ లో పూర్తి మెజారిటీకి అంటే మేజిక్ ఫిగర్ కు  కొన్ని స్థానాలు తక్కవ వచ్చే అవకాశాలున్నప్పటికీ ఇండిపెండెంట్ల మద్దతుతో అధికారం దక్కించుకునే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఛత్తీస్ గఢ్ లో స్పష్టమైన ఆధిక్యత దిశగా కాంగ్రెస్ సాగుతోంది. ఇక మధ్యప్రదేశ్ లో మాత్రం కాంగ్రెస్, బీజేపీలు హోరాహహోరీగా సాగుతోంది. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ లో బీజేపీ 110, కాంగ్రెస్ 109 స్థానాలలో ఆధిక్యతలో ఉన్నాయి. ఇతరులు 6 స్థానాలలోనూ, బీఎస్పీ 5 స్థానాలలోనూ ఆధిక్యత కనబరుస్తోంది. ఇక రాజస్థాన్ విషయానికి వస్తే ఇక్కడ 200 స్థానాలు ఉన్నాయి. కాంగ్రెస్ 99 స్థానాలలో ఆధిక్యత ఉండగా, బీజేపీ 77 స్థానాలలో ఆధిక్యత కనబరిచింది. స్వతంత్రులు 20 స్థానాలలో ముందంజలో ఉంటే, బీఎస్పీ 4 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతోంది. ఇక్కడ కాంగ్రెస్ అధికారాన్ని హస్తం చేసుకోవడం పెద్ద కష్టం కాబోదు, ఛత్తీస్ గఢ్ విషయానికి వస్తే 90 స్థానాలు ఉండగా వాటిలో కాంగ్రెస్ 64 స్థానాలలో విస్పష్టమైన ఆధిక్యత కనబరుస్తోంది. బీజేపీ 19 స్థానాలలో ముందంజలో ఉండగా, బీఎస్పీ 6 స్ధానాల్లో, ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యతలో ఉన్నాయి. మిజోరం విషయానికి వస్తే ఇక్కడ 40 స్థానాలకు గాను 24 స్థానాల్లో ఆధిక్యంలో ఎంఎన్ఎఫ్ ఆధిక్యంలో కొనసాగుతోంది.ఇక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ కేవలం 6 స్థానాల్లోనే ఆధిక్యతలో ఉంది. బీజేపీ 1 స్థానంలోనూ, ఇతరులు 9 స్థానాలలోనూ ముందంజలో ఉన్నారు. మొత్తంగా ఐదు రాష్ట్రాల ఎన్నికలలో కాంగ్రెస్ ఒక చోట అధికారాన్ని కోల్పోయింది. ఈశాన్య రాష్ట్రమైన మిజోరంలో కాంగ్రెస్ అధికారానికి దూరం కానుంది. కాగా రాజస్థాన్, ఛత్తిస్ గఢ్ లలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలను గద్దెదించి అధికారాన్ని హస్త గతం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తున్నది. మధ్య ప్రదేశ్ మాత్రం హంగ్ తప్పని పరిస్థితి కనిపిస్తున్నది.