టీడీపీ ఎంపీల ధర్నా

ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా అంశం పార్లమెంటు శీతాకాల సమావేశాలలోనూ వేడి పుట్టిస్తున్నది. పార్లమెంటు భవనంలోని గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ తో ధర్నా నిర్వహించారు. రోజుకో వేషధారణతో గత సమావేశాలలో హల్ చల్ చేసిన ఎంపీ శివప్రసాద్ ఈ సారి మెజీషియన్ వేషంలో ధర్నాలో పాల్గొన్నారు. విభజన హామీల అమలు విషయంలో కేంద్రం ఏపీకి తీరని అన్యాయం చేసిందని తెలుగుదేశం ఎంపీలు ఆరోపించారు. ఉద్దేశ పూర్వకంగా ఏపీకి నష్టం జరిగే విధంగా కేంద్రం వ్యవహరిస్తున్నదని వారు విమర్శించారు. వెనుకబడిన జిల్లాల నిధులను విడుదల చేసి తిరిగి వెనక్కు తీసుకోవడం దీనికి  నిదర్శనమని వారు ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం పార్లమెంటు లోపలా, బయటా తమ నిరసన కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.