ఢిల్లీలోబీజేపీయేతర పార్టీల కీలక భేటీ

హస్తిన వేదికగా కొత్త రాజకీయ సమీకరణాలకు ఈ రోజు జరిగే బీజేపీయేతర పార్టీల కీలక భేటీ జరగనుంది. కేంద్రంలో మోడీ సర్కార్ ను వచ్చే ఎన్నికలలో గద్దె దింపడమే లక్ష్యంగా కూటమి ఏర్పాటుపై ఈ భేటీలో కీలక చర్చ జరుగుతుంది. ఈ భేటీ జరగడానికి ఏపీ సీఎం చంద్రబాబు చొరవే ముఖ్యకారణం. ఈ రోజు జరిగే బీజేపీయేతర పక్షాల సమావేశానికి  దాదాపు 20 పార్టీల నేతలు హాజరౌతారు. పార్టీ నేతలను స్వయంగా చంద్రబాబు ఫోన్ చేసి ఆహ్వానించారు. తెలంగాణ ఎన్నికలలో తెరాసకు వ్యతిరేకంగా కాంగ్రెస్, తెలుగుదేశం, సీపీఐ, టీజెఎస్ లు ప్రజాకూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. కూటమి అధికార తెరాసను దీటుగా ఎదుర్కొందన్న అంచనాల నేపథ్యంలో ఈ రోజు హస్తినలో జరిగే బీజేపీయేతర పార్టీల భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ భేటీలో వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికలలో కలిసికట్టుగా ముందుకు సాగడంపేనే ప్రధానంగా చర్చించనున్నారు. అలాగే రేపటి నుంచి అంటే 11వ తేదీ నుంచి జరిగే పార్లమెంటు సమావేశాలలో కూడా ఉమ్మడి వ్యూహం అనుసరించి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విషయంపై కూడా కీలక చర్చ జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రాఫెల్ పై సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తారు. రాఫెల్ డీల్ పై జేపీసీకి కేంద్రం ససేమిరా అంటే మూకుమ్మడిగా ఎంపీల రాజీనామాల అంశంపై కూడా ఈ భేటీలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనా బీజేపీయేతర కూటమి ఏర్పాటు ముందుకు సాగడం అన్నది రేపు వెలువడనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుందని భావిస్తున్నారు.