తూర్పు ఏజెన్సీలో విద్యుత్ సరఫరా బంద్

పెథాయ్ తుపాను ప్రభావం తూర్పు ఏజెన్సీపై తీవ్రంగా ఉంది. తూర్పు ఏజెన్సీలో ఈ ఉదయం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కారుమబ్బులతో హోరు వాన కురుస్తుండటంతో జనం నానా అగచాట్లూ పడుతున్నారు. తుపాను ప్రభావంతో ఉభయ గోదావరి జిల్లాలలో పరిస్థితులు దయనీయంగా మారాయి. ముఖ్యంగా గ్రామాలలో రోడ్లు జలమయమైపోయాయి.ఇళ్లల్లోంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొని ఉంది. ఉదయం నుంచీ ఏకథాటిగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో గ్రామాలలో అంధకారం అలుముకుంది. తిండి, నీటికి కూడా జనం కటకటలాడే పరిస్థితి నెలకొని ఉంది. కాట్రేనికోన వద్ద తీరం దాటిన తుపాను తూర్పుగోదావరి జిల్లా, ముఖ్యంగా కోనసీమ ప్రాంతాన్ని అల్లకల్లోలం చేసింది. రాజోలు, మలికిపురం, అంబాజీపేట, సఖినేటిపల్లి, మామిడికుదురు, అల్లవరం మండలాల్లో భారీ వర్షం కురుస్తోంది. మరి కొన్ని గంటల పాటు ఏకధాటిగా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. జనం తమతమ ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించింది. ఇక తూర్పు మెట్ట ప్రాంతంలో కూడా జోరుగా వర్షం కురుస్తోంది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.