తెరాస గెలుపు అంత వీజీకాదు: లగడపాటి సర్వే సంకేతాలివే!

లగడపాటి పాక్షిక సర్వేతో అసలే కాకమీద ఉన్ తెలంగాణ రాజకీయాలను మరింత వేడెక్కించారు. నిన్న సాయంత్రం ఆయన గెలవబోతున్నారంటూ ముగ్గురు స్వతంత్రుల పేర్లు వెల్లడించారు. అక్కడితో ఆగకుండా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలెలా ఉండబోతున్నాయో సంకేతాలు కూడా ఇచ్చారు. ఆ సంకేతాల ప్రకారం తెలంగాణలో తెరాస విజయం అంత ఈజీ కాదని పేర్కొన్నారు. నాలుగు జిల్లాల్లో కూటమి, మూడు జిల్లాల్లో తెరాస, రెండు జిల్లాల్లో తెరాస ఆధిక్యతలో ఉంటే…హైదరాబాద్ లో సీట్లను మజ్లిస్, బీజేపీ, కూటమి పంచుకుంటాయన్నారు. తుది ఫలితాలు పోలింగ్ శాతాన్ని బట్టి ఉంటాయని చెప్పారు. లగడపాటి గత సర్వేలు కొంచం అటూ ఇటూలో కచ్చితంగా ఫలితాలను అంచనా వేయడంతో వాటిపై ప్రజలలోనే కాకుండా, రాజకీయ పార్టీలలో కూడా ఒకింత విశ్వసనీయత ఉన్న నేపథ్యంలో ఈ సర్వే సహజంగానే ఆసక్తి కలిగించింది. తెరాస మాత్రం దీనిని చిలక జోస్యం అంటూ ఖండించింది. గత నెల మూడో వారంలో లగడపాటి తనకు సర్వే అంచనాలను వాట్సప్ మెసేజ్ చేశారనీ, అప్పుడు తెరాస కు అత్యధిక స్థానాలు వస్తాయని పేర్కొన్నారనీ వెల్లడించిన కేసీఆర్ చంద్రబాబు ఒత్తిడి మేరకే సర్వే అంచనాలను మార్చి ప్రకటించారని కేటీఆర్ పేర్కొనడంతో లగడపాటి సర్వే అంచనాలపై ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ విస్తృతంగా చర్చ జరుగుతోంది.  ఏది ఏమైనా తెలంగాణలో ఎన్నికల పోరు ఎంత హోరాహోరీగా ఉందనడానికి గతానికి భిన్నంగా సరిగ్గా ఎన్నికలకు రోజుల ముందు రోజుకో రకంగా బయటకు వస్తున్న సర్వేలే చెబుతున్నాయి. పోలింగ్ పూర్తయిన తరువాత వెల్లడించాల్సిన సర్వేలను ముందుగానే ప్రకటించడం వెనుక ఓటర్లను ప్రభావితం చేయాలన్న ప్రయత్నమే కనిపిస్తున్నది.