తెలంగాణలో ఎన్నికల సంఘం ఫెయిల్యూర్

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల విషయంలో ఆ రాష్ట్ర ఎన్నికల సంఘం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నది. పలు విమర్శలు ఎదుర్కొని, కోర్టు ఆదేశాల మేరకు ఓటర్ల జాబితా సవరించి అంతా సరి చేశాశమంటూ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్ధతను ప్రకటించిన ఎన్నికల సంఘం తీరా ఎన్నికల నిర్వహణ విషయంలో అడుగడుగునా వైఫల్యాలను ఎదుర్కొంది. ఓటర్ల జాబితాలో తప్పులను సవరించామన్న రాష్ట్ర ఎన్నికల సంఘం మాటలు నీటి మూటలేనని పోలింగ్ నాడు తమ ఓట్లు గల్లంతయ్యాయంటూ వచ్చిన ఫిర్యాదులు, ఆరోపణల వెల్లువే నిదర్శనం. ఇక పోలింగ్ శాతాన్ని ఎప్పటికప్పుడు కచ్చితంగా చెప్పడంలో కూడా ఎన్నికల సంఘం వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నది. పోలింగ్ పూర్తయిన 48 గంటల వరకూ కూడా పోలింగ్ శాతం విషయంలో ఒక నిర్దిష్టమైన, కచ్చితమైన ప్రకటన విడుదల చేయలేకపోయింది. ఒక జాబితాలో ఓట్ల గల్లంతు విషయంలో పోలింగ్ అనంతరం ఎన్నికల సంఘం ఇచ్చిన వివరణ మరీ దారుణం. పొరపాటు జరిగింది, ఎన్నికల ప్రక్రియ అనంతరం ఓట్ల జాబితాను సవరిస్తామంటూ ఇచ్చిన వివరణ ఎన్నికల సంఘం నిర్లక్ష్యానికి నిలువుటద్దంలా నిలుస్తుంది. ప్రజలు తన ప్రతినిథులను, రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉండాలో చెప్పే తీర్పును ఎన్నికల సంఘం ప్రకటన, వివరణ అపహాస్యం చేస్తున్నట్లుగా ఉంది.  ఇన్ని లక్షల ఓట్లు ఎన్నికల సంఘం పొరపాటు కారణంగా జాబితాలో లేకుండా పోయాయి. లక్షలాది మంది తమకు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుని వినియోగించుకోవడానికి అవకాశం లేకుండా పోయింది. ఎన్నికల సంఘం నిర్లక్ష్యం ఉద్దేశ పూర్వకంగా ఒక పార్టీకి మేలు చేయడానికేనన్న విమర్శలను ఊరికే ఖండించడం కాకుండా పొరపాటుకు ఎన్నికల సంఘం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. ఎవరిపట్లా అనుకూలంగా వ్యవహరించలేదని సహేతుకంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది.