తెలంగాణ ప్రజలకు రక్షణ కవచం తెరాస

తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్రసమితి(తెరాస) రక్షణ కవచమని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తొలి సారి పార్టీ కార్యవర్గ సమావేశంలో ప్రసంగించిన ఆయన పార్టీలో తన ప్రస్థానాన్ని వివరించారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా చెక్కు చెదరకుండా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడిన పార్టీ ఒక్క తెరాస మాత్రమేనని పేర్కొన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలే కాకుండా, ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన పార్టీ తెరాస ఒక్కటేనని ఆయన అన్నారు. అందుకే తాజా ఎన్నికలలో తెలంగాణం  మొత్తం తెరాసకు అండగా నిలిచిందని పేర్కొన్నారు.

బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పిన కేటీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పార్టీ బలోపేతానికి తన శాయశక్తులా కృషి చేస్తానన్నారు. దేశంలో కాంగ్రెస్, బీజేపీల పట్ల జనం విముఖంగా ఉన్నారన్న సంగతి ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో రుజువైందని కేటీఆర్ అన్నారు. అందుకే ప్రజాకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జాతీయ స్థాయిలో బీజేపీయేతర, కాంగ్రెస్సేతర ఫెడరల్ ఫ్రంట్ కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇక త్వరలో జరగనున్న పంచాయతీ, మునిసిపల్, పార్లమెంటు ఎన్నికలలో పార్టీని మరిన్ని విజయాల దిశగా నడిపించేందుకు ప్రయత్నిస్తానని కేటీఆర్ చెప్పారు.

SHARE