తెలంగాణ ఫలితం- ఏపీలో సైకిల్ జోరుకు బ్రేక్

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం ఆంధ్రప్రదేశ్ లో కూడా చూపుతుందనడంలో సందేహం లేదు. కచ్చితంగా ఈ ఫలితం ఏపీలో ప్రధాన విపక్షం వైకాపాలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ ఇప్పటికే ఆ విషయాన్ని స్పష్టం చేసింది. వచ్చే ఏడాది ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరిగుతాయి. ఆ ఎన్నికలలో వైకాపాకు తెరాస మద్దతుగా నిలుస్తుందనడానికి ఇప్పటికే సంకేతాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఎన్నికలలో చంద్రబాబు వేలు పెట్టారు కనుక మేం కచ్చితంగా ఏపీ ఎన్నికలలో జోక్యం చేసుకుంటామని కేటీఆర్ ఇప్పటికే విస్పష్టంగా ప్రకటించారు. అంతే కాదు…జాతీయ రాజకీయాలలో బీజేపీయేతర, కాంగ్రెస్ ఏతర కూటమి (ఫెడరల్ ఫ్రంట్) ఏర్పాటు యోచనలో ఉన్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ ఫ్రంట్ ఏర్పాటుకు ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్నే లక్ష్యం చేసుకున్నా ఆశ్చర్య పోనవసరం లేదు. తెరాస ఫలితాల జోష్ తో ఆయన ఏపీలో వైకాపా, జనసేన పార్టీలతో కూటమి ఏర్పాటుకు శ్రీకారం చుట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎందుకంటే ఆ రెండు పార్టీలూ కూడా తెలంగాణ ఎన్నికల విషయంలో బహిరంగంగా ఎటువంటి నిర్ణయాన్ని ప్రకటించనప్పటికీ లోపాయికారీగా తెరాసకు మద్దతు పలికారన్న ప్రచారం ఉంది. వైకాపా తెలంగాణ అధ్యక్షుడు కూటమికి మద్దుత ప్రకటించిన మరుక్షణం పార్టీ నుంచి శాశ్వతంగా బహిష్కరణకు గురి కావడమే ఇందుకు నిదర్శనం. అన్నిటికీ మించి ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో పరస్పర విమర్శలు గుప్పించుకుంటున్న వైకాపా, జనసేన పార్టీలను కేసీఆర్ ఏకతాటిపైకి తీసుకువచ్చి ఫెడరల్ ఫ్రంట్ లో భాగస్వాములను చేయడంలో సఫలీకృతమైతే తెలుగుదేశం పార్టీకి ఏపీలో కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదురుయ్యే అవకాశాలు ఉంటాయనడంలో సందేహం లేదు.