దేశానికి కాదు గుజరాత్ కే మోడీ ప్రధాని

నరేంద్రమోడీ దేశం మొత్తానికీ ప్రధానిగా వ్యవహరించడం లేదని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు తీవ్ర స్థాయిలో విమర్శించారు. పోలవరం  ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు  అమర్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశ ప్రధాని మోడీ వ్యవహార తీరు చూస్తుంటే ఆయన కేవలం గుజరాత్  రాష్ట్రానికే ప్రధానా అన్న అనుమానం కలుగుతోందని చంద్రబాబు అన్నారు. గుజరాత్ లో ప్రాజెక్టులపై ఉన్న మక్కువ ప్రధాని మోడీకి పోలవరంపై కనిపించడం లేదని విమర్శించారు.

గుజరాత్ ప్రాజెక్టులను పరిశీలించేందుకు తరచూ వెళ్లే ప్రధాని మోడీ పోలవరం పరిశీలను ఇంత వరకూ ఒక్కసారి కూడా రాలేదన్నారు. గుజరాత్ లో ప్రాజెక్టులకు, ఆ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంలోని మోడీ సర్కార్ చేయూతను ఇవ్వడాన్ని తాము అభ్యంతరం పెట్టడం లేదనీ, కానీ అదే సమయంలో దేశంలో ఇతర రాష్ట్రాల ప్రగతిని కూడా ఆయన పట్టించుకోవాలని చంద్రబాబు అన్నారు.

జాతి గర్వించేలా తాము పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తుంటే…జాతీయ హోదా ఉన్న పోలవరం వ్యయం మొత్తం భరించాల్సిన కేంద్రం నిధుల విడుదాల విషయంలో తీవ్ర వివక్ష చూపుతూ పురోగతికి అడ్డంపడుతున్నదని చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు. పట్టిసీమను రికార్డు స్థాయిలో ఏడాదిలో పూర్తి చేయడం ద్వారా అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమెలాగే తాము నిరూపించామన్నారు. అదే విధంగా నిర్ణీత సమయంలో పోలవరం ప్రాజెక్టును కూడా పూర్తి చేసి రాష్ట్ర ప్రజల వందేళ్ల కలను సాకారం చేస్తామని చంద్రబాబునాయుడు ఈ సందర్భంగా అన్నారు.