నేటి నుండి 5రోజులు బ్యాంకు సేవలు బంద్

దిల్లీ: దేశవ్యాప్తంగా బ్యాంకింగ్‌ కార్యకలాపాలు శుక్రవారం నుంచి ఐదు రోజుల పాటు నిలిచిపోనున్నాయి. వరుస సెలవులు, సమ్మెలతో బ్యాంకులు మూతబడనున్నాయి. అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘం డిసెంబరు 21న (శుక్రవారం) సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో రేపు బ్యాంకులు పనిచేయవు. ఇక డిసెంబరు 22 నాలుగో శనివారం, డిసెంబరు 23 ఆదివారం బ్యాంకులకు సెలవు దినాలు. డిసెంబరు 24 సోమవారం బ్యాంకులు పనిచేస్తాయి. ఆ తర్వాత 25న క్రిస్మస్‌ సందర్భంగా బ్యాంకులు పనిచేయవు. ఇక డిసెంబరు 26న యునైటెడ్ ఫోరమ్‌ ఆఫ్‌ బ్యాంక్‌ యూనియన్స్‌(యూఎఫ్‌బీయూ) సమ్మెకు పిలుపునిచ్చింది. దీంతో సోమవారం మినహా డిసెంబరు 21 నుంచి 26 వరకు బ్యాంకు కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి.  వరుస సెలవుల కారణంగా ఏటీఎంలలో నగదు కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. రేపు సమ్మె జరిగినా ఏటీఎంలు యథావిధిగా పనిచేస్తాయి. దీంతో శుక్రవారం నగదు సమస్య ఉండకపోవచ్చు. డిసెంబరు 26 వరకు మాత్రం నగదు కొరత ఏర్పడే అవకాశముంది. అన్ని స్థాయిల్లో వేతన సవరణ డిమాండ్‌తో బ్యాంకు యూనియన్లు రెండు రోజుల సమ్మెకు దిగాయి.