న్యూఇయర్ వేడుకలకు పిలువ లేదని”

బ్యాంకాక్, జనవరి 1 :‌ నూతన సంవత్సర వేడుకలకు తనను అత్తింటి వారు ఆహ్వానించలేదన్న కోపంతో అల్లుడు తన కుటుంబాన్నే కడచేర్చాడు.  థాయిలాండ్‌లోని ఛుంపాన్‌ ప్రావిన్స్‌లో ఈ ఘటన జరిగింది. సుచీప్‌ సార్న్‌సంగ్‌ అనే వ్యక్తి తన అత్తింటి వారు నూతన సంవత్సర వేడుకలు చేసుకుంటున్న ప్రదేశానికి గత రాత్రి వెళ్లాడు. అయితే అత్తింటి వారు ఆ వేడుకలకు తనను పిలవలేదనే కోపంతో కుటుంబసభ్యులపై తుపాకీతో దాడికి తెగబడ్డాడు.

‘మద్యం సేవించిన సంగ్‌ తుపాకీతో పార్టీ జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి వారిపై కాల్పులు జరిపాడు. మృతుల్లో అతడి తొమ్మిదేళ్ల కొడుకు, ఆరేళ్ల కూతురు కూడా ఉన్నారు. అత్తింటి వారు వేడుకలకు పిలవలేదనే ఆగ్రహంతో అందరినీ కాల్చి హత్య చేశాడు. ఈ దాడిలో మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు’ అని అక్కడి పోలీసులు తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.