పుణె : పరాజయాన్ని అనాథలా వదిలేస్తారు!

నాయకత్వం విజయాన్ని ఎలా సొంతం చేసుకుంటుందో…పరాజయాన్ని కూడా అలాగే అంగీకరించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి అన్నారు. కోపరేటివ్ బ్యాంక్ అసోసియేషన్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడిన ఆయన విజయాన్ని సొంతం చేసుకునేందుకు చాలా మంది ముందుకు వస్తారనీ, అయితే అపజాయాన్ని మాత్రం అనాథలా వదిలేస్తారని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కీలకమైన మూడు హిందీ బెల్ట్ రాష్ట్రాలలో బీజేపీ పరాజయం పాలైన నేపథ్యంలో గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మనసులో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేసే గడ్కరీ ఇటివలి పరాజయాలకు ఎవరూ బాధ్యత తీసుకోవడానికి ముందుకు రావడం లేదని తన వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా పార్టీ నాయకత్వానికి చురకలంచారు. పరాజయం ఎదురైనప్పుడు ప్రతి వారూ ఎదుటివారిపై నెపం నెట్టివేయడానికి ప్రయత్నిస్తారని అన్నారు. అయతే తాను మాట్లాడినది రాజకీయాల గురించి కాదనీ, బ్యాంకుల జయాపజయాల గురించి అని వివరణ ఇస్తూ..కొన్ని సార్లు బ్యాంకులు విజయం సాధిస్తాయనీ, అయితే పరాజయాలను కూడా ఎదుర్కొన వలసి ఉంటుందన్నారు.