ప్యాకేజీ ఇచ్చేశాం, హోదా ఎందుకు: జైట్లీ

ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అంశమని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పేర్కొన్నారు. రాజ్యసభలో తెలుగుదేశం సభ్యుడు రవీంద్రకుమార్ ప్రశ్నకు సమాధానమిచ్చిన ఆయన ఏపీకి హోదాతో సమానమైన, అంతకంటే ఎక్కువ ప్రయోజనం చేకూరేలా ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇచ్చామని చెప్పారు. హోదా నిరాకరించడానికి ఆయన నాలుగున్నరేళ్లుగా చెబుతున్న కారణాన్నే మరోసారి చెప్పారు. 14వ ఆర్థిక సంఘం నివేదిక తరువాత ప్రత్యేక హోదా అన్నదే లేకుండా పోయిందనీ, అందుకే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించామని చెప్పారు.

14వ ఆర్ధిక సంఘం చైర్మన్ హోదా అంశం తమ పరిధిలో లేదని పలుమార్లు చెప్పినా కేంద్రం పట్టించుకోవడం లేదు. ఫలానా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలనీ, లేదా ఇవ్వవద్దనీ తామెటువంటి సిఫారసులూ చేయలేదనేి గతంలోనే 14వ ఆర్థిక సంఘం తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. దీంతోనే ఏపీలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ హోదా కోసం పట్టుబడుతోంది. కేంద్రాన్ని నిలదీస్తున్నది. ఈ విషయంలోనే కేంద్రంతో విభేదించి తెలుగుదేశం కేబినెట్ నుంచీ ఎన్డీయే నుంచీ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.