ప్రధాని మోడీ ఏపీ పర్యటన ఖరారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వచ్చే ఏడాద జనవరి 6న పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొంటారు. విభజన హామీల అమలు, ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కు తదితర అంశాలలో కేంద్రంలోని మోడీ సర్కార్ నమ్మక ద్రోహం చేసిందంటూ తెలుగుదేశం పార్టీ విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. ఏపీ సీఎం చంద్రబాబు సహా తెలుగుదేశం శ్రేణులు కేంద్ర ప్రభుత్వాన్నే కాకుండా ఏపీకి జరిగిన అన్యాయంపై నేరుగా మోడీ పేరు చెబుతూనే విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే  కేంద్రం కూడా ఏపీ పట్ల ఒకింత ఆగ్రహంతోనే ఉంది. రాజకీయంగా ఉప్పు, నిప్పులా బీజేపీ- తెలుగుదేశంల సంబంధాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చినప్పటి నుంచీ ఈ అగాధం మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రధాని ఏపీ టూర్ పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. ఏపీలో ఒంటరిగా పాగా వేయాలనుకుంటున్న బీజేపీ మోడీ పర్యటన సందర్భంగానైనా ఏపీకి కొన్ని హామీలను మోడీ ఈ పర్యటనలో ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు.