బాబుది భస్మాసుర హస్తం:జగన్

తెలంగాణ ఫలితం కాంగ్రెస్-టీడీపీల పొత్తుకు వ్యతిరేకంగా వచ్చిన ప్రజాతీర్పుగా వైకాపా అధినేత జగన్ అభివర్ణించారు. అవాస్తవాలు చెప్పి, ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవాలంటే సాధ్యపడదని, ప్రజలు అటువంటి నేతలకు బుద్ధి చెబుతారని జగన్ అన్నారు. తెలంగాణ ప్రజా తీర్పు అదేనని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఆయన పాదయాత్ర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితంపై స్పందించిన ఆయన భస్మాసురుడి చేయి, చంద్రబాబు కాలు ఒకలాంటివేనని, అవి ఎక్కడ పెట్టినా భస్మమేనని జగన్ పేర్కొన్నారు. కాంగ్రెస్, తెలుగుదేశం పొత్తు అనైతికమని ప్రజలు తీర్పు ఇచ్చారని అన్నారు. చంద్రబాబు అవినీతిపై కాంగ్రెస్ కొద్ది కాలం కిందటే పుస్తకం ప్రచురించిందనీ, ఆ వెంటనే తెలంగాణ ఎన్నికలలో చంద్రబాబుతో చేయి కలిపిందని విమర్శించారు. తెలంగాణ ఫలితమే ఏపీలోనూ వస్తుందని ఆయన అన్నారు. ఏపీ ప్రజలకు చంద్రబాబు వ్యవహారం పూర్తిగా అర్ధమైపోయిందని జగన్ పేర్కొన్నారు.