బీజేపీ స్టార్ క్యాంపెయినర్ యోగి

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక విషయంలో ప్రధాని మోదీని మించిపోయారు. బీజేపీలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా మోదీ ఇప్పటికీ నంబర్ వన్. అందులో సందేహం లేదు. కానీ ఎన్నికల ప్రచారంలో పార్టీ క్యాంపెయినర్ గా..ప్రచార సభలకు పెద్ద సంఖ్యలో జనాలను ఆకర్షించగలిగిన నేతగా మోదీ కంటే యోగి ఆదిత్యనాథే ముందుంటున్నారు. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులే స్వయంగా చెబుతున్నాయి. వారు చెప్పడమే కాకుండా ఇటీవలి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వంలో ప్రధాని మోదీ కంటే యోగి ఆదిత్యనాథే ఎక్కువగా కనిపించారు. మోదీ కంటే ఎక్కువ ఎన్నికల ర్యాలీలలోనూ, బహిరంగ సభలలోనూ యోగి పాల్గొని ప్రసంగించారు. మిజోరంను మినహాయిస్తే మిగిలిన నాలుగు రాష్ట్రాలలోనూ కూడా పార్టీ స్టార్ క్యాంపెయినర్ గా యోగి ఆదిత్యనాథే నిలిచారు. ఛత్తిస్ గఢ్ లో యోగి ఆదిత్యనాథ్ 23 సభలలో పాల్గొని ప్రసంగించారు. రాజస్థాన్ లో అయితే ఆయన ఏకంగా 26 ఎన్నికల ప్రచార సభలలో ప్రసంగించారు. మధ్య ప్రదేశ్ కు వచ్చే సరికి ఆయన 17 సభలలో ప్రసంగించారు. తెలంగాణలో ఎనిమిది సభలలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రిగా స్వరాష్ట్రంలో శాంతి భద్రదల సమస్య పరిష్కారంలో వైఫల్యాలను ఎదుర్కొంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నా పార్టీలో ఆయన స్టార్ క్యాంపెయినర్ గా మారడానికి కారణం ఆయన సభలకు వస్తున్న జనం, ఆయన ప్రసంగాలకు వస్తున్న స్పందనే అని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ప్రధాని మోదీ తరువాత పార్టీకి మరో జనాకర్షణ కలిగిన నేత యోగి ఆదిత్యనాథేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.