మందిర నిర్మాణానికి మంచి తరుణం

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఇదే మంచి తరుణమని బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి అంటున్నారు. మోడీ సర్కార్ ఆ దిశగా వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.సుబ్రహ్మణ్య స్వామి అయోధ్యలోని వివాదాస్పద స్థలంలో రామమందిర నిర్మాణం చేపట్టాల్సిందేనంటూ గట్టిగా వాదించే రాజకీయ నాయకులలో ప్రథముడిగా నిలుస్తారన్న సంగతి తెలిసిందే. 1994 లో అప్పటి పీవీ నరసింహరావు ప్రభుత్వం సుప్రీం కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ ఆధారంగా మోడీ సర్కార్ చర్యలు ప్రారంభించాలని తాజాగా ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు.

అప్పట్లో పీవీ నరసింహరావు కేబినెట్ లో సుబ్రహ్మణ్వ స్వామి మంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. అప్పట్లో అయోధ్యలో రామందిరం సమస్య పరిష్కారానికి ఉన్న అవకాశాలను సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు పీవీ నరసింహరావు సర్కార్ సమర్పించిందని అన్నారు. నాడు పీవీ సర్కార్ చూపిన పరిష్కారాలలో ఒకటి వివాదాస్పద భూమిలో మందిర అవశేషాలు ఉంటే అక్కడ రామమందిరం నిర్మించాల్సిందేనన్నది ఒకటని ఆయన పేర్కొన్నారు.  ఇప్పుడు మోడీ సర్కార్ నాడు పీవీ నరసింహరావు సర్కార్ చూపిన ఈ పరిష్కారంపై ముందుకు సాగాల్సిన అవసరం ఉందని సుబ్రహ్మణ్య స్వామి అన్నారు.