మిజోరంలో కమలానికి రిక్త హస్తమే

ఈశాన్య రాష్ట్రాలలో ఇప్పటి వరకూ కమలానికి స్థానం లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక్క మిజోరం మాత్రమే. ఈ సారి ఎన్నికలలో ఎలాగైనా అక్కడ పాగా వేయాలని భావించిన బీజేపీకి నిరాశే ఎదురౌతుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చేస్తున్నాయి. 40 స్థానాలున్న మిజోరం రాష్ట్రంలో బీజేపీ కనీసం ఒక్క స్థానంలో కూడా గెలిచే అవకాశాలు లేవని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెబుతున్నాయి. మిజోరంలో అధికారంలోకి రావాలంటే కనీసం 21 స్థానాలలో విజయం సాధించాలి. అయితే బీజేపీ ఒక్క స్థానంలో కూడా గెలిచే అవకాశం లేదని సీ-ఓటర్-రిపబ్లిక్ టీవీ, టైమ్స్ నౌ, ఇండియా టుడేల ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. అలాగని ఇక్కడ కాంగ్రెస్ కూడా పూర్తి మెజారిటీ సాధించే అవకాశం లేదు. కాంగ్రెస్-ఎమ్ఎన్ఎఫ్ ల మధ్య హోరాహోరీ పోరు జరిగింది. రాష్ట్రంలో హంగ్ ఏర్పడే అవకాశాలే ఎక్కువ ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. కాంగ్రెస్ 14-18 స్థానాలలోనూ, ఎమ్ఎన్ఎఫ్ 16-20 స్థానాలలోనూ విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొన్నాయి.