మూడు రాష్ట్రాల్లో విజయం- కాంగ్రెస్ లో జోష్

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ లో జోష్ నింపాయి. లోక్ సభ ఎన్నికల ఫలితాలకు లిట్మస్ టెస్ట్ గా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో మూడు రాష్ట్రాలలో హస్తవాసి బాగుంది. రాజస్థాన్, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లలో సాధించిన విజయాలు కాంగ్రెస్ లో జోష్ నింపాయి. ముఖ్యంగా మూడు రాష్ట్రాలలోనూ బీజేపీ ప్రభుత్వాలను గద్దె దింపి అధికారాన్ని కైవసం చేసుకోవడంతో సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ శ్రేణులలో ఉత్సాహాన్ని నింపింది. అదే సమయంలో వరుస విజయాలకు బ్రేక్ పడటంతో బీజేపీ డీలా పడింది. రాజస్థాన్ లో వసుంధరరాజే సర్కార్ కు పరాభవం ఎదురైంది. హస్తం హవా ముందు తలవొంచింది. ఇక మధ్య ప్రదేశ్ లో బీజేపీ గట్టి పోటీ ఇచ్చినా కాంగ్రెస్ పై చేయి సాధించింది. ఛత్తీస్ గఢ్ లో అయితే 15 ఏళ్ల పాటు అధికారం చెలాయించిన రమణ్ సింగ్ సర్కార్ తాజా ఎన్నికలలో కాంగ్రెస్ కు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ఇక మిజోరంలో కాంగ్రెస్ గెలవకపోయినా, బీజేపీ ఘోరంగా పరాజయం పాలు కావడం, మిత్రపక్షమైనా ఒంటరిగా పోటీ చేసినఎంఎన్ఎఫ్ విజయం సాధించడం కాంగ్రెస్ కు సంతోషం కలిగించే విషయమే. ఈ విజయాలు సార్వత్రిక ఎన్నికలకు ముందు కాంగ్రెస్ శ్రేణులలో ఉత్సాహాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ నింపుతాయనడంలో సందేహం లేదు.