మోడీ సర్కార్ పై ఉర్జిత్ బాంబ్

సరిగ్గా పార్లమెంటు సీతాకాల సమావేశాల ప్రారంభానికి ఒక్క రోజు ముందు ఆర్బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేశారు. కేంద్రంలోని మోడీ సర్కార్ కు ఇది కచ్చితంగా కొత్త తలనోప్పులను తెచ్చిపెడుతుంది. ఆర్బీఐ గవర్నర్ పదవి కోసం కేంద్రం ఏరి కోరి తెచ్చుకున్న ఉర్జిత్ పటేల్..గత బోర్డు సమావేశాలకు ముందే రాజీనామా హెచ్చరిక చేశారు. కేంద్రంఆర్బీఐపై పెత్తనం చెలాయిస్తున్నదన్న ఆరోపణలూ నాడు వెల్లువెత్తాయి. తరువాత అంతా సర్దుమణిగిందని భావిస్తున్న వేళ, పార్లమెంటు శీతాకాల సమావేశాల ప్రారంభానికి సరిగ్గా ఒక్క రోజు ముందు, ఆర్బీఐ బోర్డు సమావేశాలకు మూడు రోజుల ముందు ఉర్జిత్ పటేల్ వ్యక్తిగత కారణాలంటూ తన పదవికి రాజీనామా చేశారు. అయితే వ్యక్తిగత కారణాల దృష్ట్యానే ఉర్జిత్ రాజీనామా చేశారన్న విషయాన్ని ఎవరూ నమ్మడం లేదు. ఉర్జిత్ ను కొనసాగాలని స్వయంగా ప్రధాని మోడీ కోరితే బాగుంటుందని బీజేపీ సీనియర్ నేత, ఎంపి సుబ్రహ్మణ్య స్వామి అనడాన్ని బట్టే రాజీనామా వెనుక కారణాలేమిటన్నది తేటతెల్లం అవుతున్నది. ఉర్జిత్ రాజీనామా మోడీ సర్కార్ పై వేసిన బాంబేనని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఈ రాజీనామా మోడీ సర్కార్ ప్రతిష్టను మసకబార్చడమే కాకుండా ఆర్బీఐ స్వయం ప్రతిపత్తికి ప్రభుత్వం గండికొడుతున్నదన్న విపక్షాల విమర్శలకు బలం చేకూరుతుంది. అలాగే ఆర్బీఐపై కేంద్ర ఆర్థిక మంత్రి ఇటీవల చేసిన వ్యాఖ్యలూ మళ్లీ తెరపైకి వచ్చి కేంద్ర బ్యాంకుపై ప్రభుత్వ పెత్తనానికి నిదర్శనాలుగా నిలుస్తాయి.