రథయాత్ర కోసం సుప్రీం కు బీజేపీ

97 views

పశ్చిమ బెంగాల్ లో పట్టు సాధించడానికి రథయాత్రే మార్గమని స్థిర నిశ్చయంతో ఉన్న బీజేపీ..ఈ యాత్రకు అనుమతి కోసం సుప్రీం కోర్టును ఆశ్రయించాలన్న నిర్ణయానికి వచ్చింది. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ తలపెట్టిన రథయాత్రకు ఆ రాష్ట్ర ప్రభుత్వం బ్రేక్ వేయడంతో బీజేపీ కోల్ కతా హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కోల్ కతా హైకోర్టు సింగిల్ జడ్జి బెంచ్ రథయాత్రకు అనుమతి ఇస్తూ ఇచ్చిన తీర్పును కోల్ కతా హైకోర్టు ధర్మాసనం కొట్టివేసిన సంగతి విదితమే. దీంతో బీజేపీ సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించింది. ఈ మేరకు సుప్రీం వెకేషన్ బెంచ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నది.

బీజేపీ రథయాత్ర కారణంగా రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉందని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చెబుతోంది. అలాగా రాష్ట్రంలో విపక్ష లెఫ్ట్ ఫ్రంట్ కూడా బీజేపీ రథయాత్రను వ్యతిరేకిస్తున్నది. ఈ యాత్ర వల్ల రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని లెఫ్ట్ ఫ్రంట్ ఆందోళన వ్యక్తం చేస్తున్నది.