రాజస్థాన్ నేతలతో రాహుల్ మరోసారి భేటీ

రాజస్థాన్ ముఖ్యమంత్రి ఎవరన్న విషయంలో నెలకొన్న సందిగ్ధత, ప్రతిష్టంభన ఇంకా తొలగలేదు. సీఎం పదవి కోసం పోటీ పడుతున్న గెహ్లాట్, సచిన్ పైలట్లతో రాహుల్ గాంధీ నిన్న భేటీ అయిన సంగతి తెలిసిందే. వీరిరువురితో పాటూ పార్టీ సీనియర్లతో కూడా భేటీ అయిన రాహుల్ గాంధీ రాజస్థాన్ విషయంలో సుదీర్ఘంగా చర్చలు జరిపారు.

అయితే సీఎం అభ్యర్థి ఎంపిక విషయంలో ఎటూ నిర్ణయం తీసుకోలేకపోయారు. ఇలా ఉండగా రాజస్థాన్ సీఎంగా గెహ్లాట్ ను ఎంపిక చేశారన్న వార్తలు వెలువడిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సచిన్ పైలట్ కు మద్దతుగా ఆందోళలను వెల్లువెత్తాయి. సచిన్ పైలట్ పార్టీ శ్రేణులు ప్రశాంతంగా ఉండాలని విజ్ణప్తి చేసిన ఫలితం లేకపోయింది. కాగా రాజస్థాన్ విషయంలో ఏర్పడిన ప్రతిష్టంభనను తొలగించేందుకు రాహుల్ గాంధీ ఈ రోజు మరోసారి పార్టీ సీనియర్లతో భేటీ కానున్నారు. అలాగే గెహ్లాట్, పైలట్లతో కూడా చర్చించే అవకాశం ఉంది. ఏది ఏమైనా రాజస్థాన్ లో విజయం సాధించిన ఆనందం కంటే సీఎం ఎంపికలో ఎదురౌతున్న తలనొప్పులే కాంగ్రెస్ కు ఇబ్బందికరంగా మారాయని చెప్పాల్సి ఉంటుంది.