రాముడిపై పుస్తకం రాసినందుకు కేసు

బెంగుళూరు, జనవరి 2: ‘‘రామ మందిర యేకే బేడ’’(రామ మందిరం అవసరం ఏముంది?) అనే వివాదాస్పద పుస్తకం రాసిన కన్నడ రచయిత కేఎస్ భగవాన్ పై పోలీసు కేసు నమెదు అయ్యింది. రాముడు అసలు దేవుడే కాదనే విధంగా రచయిత పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకంపై ఓ హిందుత్వ సంస్ధ ఫిర్యాదు మేరకు కర్నాటక పోలీసులు కేసు నమోదు చేశారు. మతపరమైన భావోద్వేగాలకు దెబ్బతీసే విధంగా రాతలు రాశారన్న ఐపీసీ సెక్షన్ 295 ఏ కింద కేసు నమోదు చేశారు.
ఈ అంశంపై కర్నాటక సీఎం కుమారస్వామి స్పందించకపోవడంపై భారతీయ జనతా పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పుస్తక రచయితను తక్షణం అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. బిజెపి ఎమ్మెల్యే ఎన్ సురేశ్ కుమార్ తన ఫేస్‌బుక్ ఖాతాలో భగవాన్‌ను అరెస్టు చేసి జైలుకు పంపించాలనీ, లేనిపక్షంలో మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయాలని పోస్టు చేశారు. మైసూరు జిల్లాకు చెందిన హిందూ జాగరణ్ వేదిక అధ్యక్షుడు కె. జగదీష్ హెబ్బార్ భగవాన్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ పుస్తకంలో ప్రధానంగా రాముడు దేవుడు కాదు సామాన్య వ్యక్తిలాగా అనేక కష్టాలు పడ్డాడు అంటూ ప్రస్తావించాడు.