రాహుల్ క్షమాపణకు అమిత్ షా డిమాండ్

రాఫెల్ ఒప్పందం విషయంలో అవాస్తవాలు వ్యాప్తి చేసినందుకు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా డిమాండ్ చేశారు. రాహుల్ ఒప్పందం పారదర్శకంగానే జరిగిందని, ఈ విషయంలో దర్యాప్తు అవసరం లేదని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో ఆయన ఈ డిమాండ్ చేశారు.

రాఫెల్ ఒప్పందంపై రాహుల్ తో బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. ఢిల్లీలో ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడిన అమిత్ షా…ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ రాఫెల్ అంశంపై పార్లమెంటును స్తంభింపచేయడం మానుకోవాలన్నారు. ఇప్పటికైనా రాఫెల్ ఒప్పందంలో అవినీతి జరిగిందన్న సమాచారం ఎక్కడ నుంచి వచ్చిందన్న విషయాన్ని రాహుల్ వెల్లడించాలన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ హయాంలో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం అమలులో ప్రతిష్టంభన ఏర్పడిందో రాహుల్ వివరణ ఇవ్వాలని అమిత్ షా డిమాండ్ చేశారు. రాఫెల్ పై రాహుల్ చేసిన ఆరోపణలన్నీ పిల్ల చేష్టలుగా ఉన్నాయన్న అమిత్ షా ఇప్పటికైనా కాంగ్రెస్ అధినేత ఇటువంటి చిల్లర ఆరోపణలు మానుకోవాలని హితవు పలికారు.