రెండో టెస్ట్ కు ముందు భారత్ కు షాక్

ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ ను తొలి టెస్టు విజయంతో శుభారంభం చేసిన భారత్ కు రెండో టెస్టుకు ముందు భారీ షాక్ తగిలింది. స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, రవిచంద్ర అశ్విన్ గాయం కారణంగా రెండో టెస్టుకు దూరం అయ్యారు. వీరిరువురూ రెండో టెస్టులో ఆడటం లేదని బీసీసీఐ ప్రకటించింది. ఇప్పటికే యువ బ్యాటింగ్ సంచలనం పృధ్వీషా గాయం కారణంగా తొలి రెండు టెస్టులకు దూరం అయిన సంగతి తెలిసిందే.

పెర్త్ వేదికగా రేపటి నుంచి భారత్- ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. బ్యాటింగ్ లైనప్ లో లోయర్ ఆర్డర్ కు రోహిత్ శర్మ వెన్నెముకగా నిలుస్తున్నాడు. అలాగే తొలి టెస్ట్ లో తన స్పిన్ మాయాజాలంతో అశ్విన్ ఆసీస్ బ్యాట్స్ మన్ ను బోల్తా కొట్టించి విజయంలో ప్రముఖ పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. సీరిస్ విజయం లక్ష్యంతో ఆసీస్ పర్యటనకు వెళ్లిన భారత్ కు వీరిరువురూ రెండో టెస్ట్ కు దూరం కావడం కచ్చితంగా ఎదురుదెబ్బే.