రైతు రుణమాఫీ నష్టదాయకం

రైతు రుణాలను మాఫీ చేయడం వల్ల ప్రయోజనం పెద్దగా ఉండదని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామరాజన్ పునరుద్ఘాటించారు. ఛత్తీసగఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల ఫలితాల అనంతరం ఆయనీ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ మూడు రాష్ట్రాలలోనూ తాజా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ మూడు రాష్ట్రాలలోనూ రైతు రుణమాఫీ చేస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చింది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రధానంగా పేర్కొంది. ఆ హామీయే ఈ రాష్ట్రాలలో కాంగ్రెస్ విజయాలకు ప్రధాన కారణాలలో ఒకటన్నది విదితమే. ఈ నేపథ్యంలో రఘురామ రాజన్ రుణమాఫీపై చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. గతంలో ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం రుణమాఫీ అమలుకు ఉపక్రమించినప్పుడు కూడా అప్పట్లో ఆర్బీఐ గవర్నర్ గా ఉన్న రఘురామరాజన్ అభ్యంతరం చెప్పిన సంగతి విదితమే. పైగా రుణమాఫీ వంటి పథకాల వల్ల పేదల కన్నా పలుకుబడి గలిగిన సంపన్నులే ఎక్కువ ప్రయోనం పొందుతారని ఆయన అభిప్రాయపడ్డారు.  ఎన్నికల హామీలలో రైతు రుణమాఫీ అంశం ఉండకూడదని, ఈ మేరకు ఎన్నికల కమిషన్ నిబంధన తీసుకురావలసిన అవసరం కూడా ఉందని పేర్కొన్నారు. ఎన్నికల సంఘానికి తానీ మేరకు లేఖ కూడా రాసినట్లు తెలిపారు.
SHARE