లండన్ : క్రిస్టియన్ మిచెల్ అరెస్టుతో మాల్యాలో వణుకు- బకాయిలు తీర్చేస్తానంటూ బ్యాంకులకు సమాచారం

అగస్టా వెస్ట్ ల్యాండ్ డీల్ లో మీడియేటర్ గా వ్యవహరించిన క్రిస్టియన్ మిచెల్ అరెస్టుతో  బ్యాంకుల నుండి వేల కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టి లండన్ పారిపోయిన లిక్కర్ కింగ్ విజయమాల్యాలో వణుకు ప్రారంభమైంది. ఆర్థిక నేరగాళ్లను భారత్ రప్పించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలు మాల్యాకు చెమటలు పట్టిస్తున్నాయి. మిచెల్ ను భారత్ కు రప్పించడంలో భారత్ తొలి విజయం సాధించిందని చెప్పారు. విజయ్ మాల్యా, నీరవ్ మోడీ తదితరులను కూడా త్వరలోనే స్వదేశానికి రప్పిస్తామన్న ధీమా భారత్ లో వక్యక్తమౌతున్నది. ఈ నేపథ్యంలోనే విజయ్ మాల్యా తాను బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలన్నీ చెల్లించేస్తాననీ, దయచేసి తీసుకోవాలని బ్యాంకులను కోరుతున్నారు. మనీ ల్యాండరింగ్ కేసులో మాల్యాను భారత్ కు అప్పగించాలని భారత ప్రభుత్వం లండన్  కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను విచారించిన లండన్ కోర్టు త్వరలో తీర్పు వెలువరించనుంది. మరో ఐదారు రోజుల్లో తీర్పు వెలువడుతుందన్న వార్తల నేపథ్యంలో మాల్యా బేలగా కింగ్ ఫిషర్ వల్లే ములిగిపోయానని పేర్కొంటూ…భారత్ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలన్నిటినీ పూర్తిగా చెల్లించేస్తాననీ, వాటిని తీసుకోవాలంటూ బ్యాంకులకు విజ్ణప్తి చేయడం గమనార్హం.