వంగవీటి రంగాను ఎన్నటికీ మరచిపోలేరు

కృష్ణా, డిసెంబరు26: ప్రజల హృదయాల్లో దివంగత వంగవీటి రంగా చిరస్మరణీయులని వైసిపి నేత, మాజీ శాసనసభ్యులు వంగవీటి రాధాక‌ృష్ణ అన్నారు. బుధవారం వంగవీటి రంగా 30వ వర్ధంతి సందర్భంగా కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలం కాటూరులో రంగా స్మారక భూమికి రాధా శంఖుస్థాపన చేశారు. రంగా మరణించినప్పుడు తాను పదేళ్ళవాడిననీ, ఇప్పటికీ తమ అభిమాన నేత వర్ధంతి కార్యక్రమాలను అభిమానులు నిర్వహిస్తున్నారన్నారు. రంగాను నమ్ముకునివున్నవారిని ఆదుకోవాల్సిన అవసరంవుందని అందుకోసం కృషి చేస్తానని రాధా తెలిపారు. తన తండ్రి ఆశయ సాధనకోసం చివరివరకు పనిచేస్తానన్నారు.
అడ్డుగా ఉన్నారని హతమార్చారు
అప్పటి రాజకీయ పరిస్థితుల్లో తమకు అడ్డుగావున్నాడని రంగాను దారుణంగా హతమార్చారని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అన్నారు. రంగా హత్య అనంతరం రాష్ర్టంలో చోటుచేసుకున్న పరిణామాలు ప్రజలందరికీ తెలుసన్నారు. రాష్ర్ట ప్రజలు రంగాను ఎన్నటికీ మరచిపోలేరన్నారు. కేవలం నాలుగేళ్ళు ఎమ్మెల్యేగా పనిచేసిన రంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారన్నారు. ప్రజల గుండెల్లో రంగా ఎప్పుడూ చిరంజీవిగానే ఉన్నారన్నారు.