వణికిస్తున్న పెథాయ్-ఏపీ సర్కార్ అప్రమత్తం

పెథాయ్ వణికిస్తున్నది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మరింత తీవ్ర తుపానుగా మారి రేపు రాత్రి లేదా ఎల్లుడి ఉదయానికి మచిలీపట్నం- అమలాపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీని ప్రభావం కోస్తా జిల్లాలపై తీవ్రంగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. తుపాను ప్రభావంతో వచ్చే 24 గంటలలో కోస్తా, సీమ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో తీరం వెంబడి 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో పెనుగాలలు వీస్తున్నాయి. తుపాను తీరం దాటే సమయంలో వీటి తీవ్రత 120 నుంచి 140 కిలోమీటర్ల వేగానికి పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

ఇలా ఉండగా తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. తుపాను ప్రభావం ఉండే అన్ని జిల్లాలలోనూ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. మంత్రి లోకేష్ కార్యాలయంలో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. ఇది 24 గంటలూ పని చేస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సీఎస్ తుపాను పై సమీక్ష జరిపారు. కలెక్టర్లను అప్రమత్తం చేశారు. తుపాను కారణంగా ప్రాణనష్టాన్ని నివారించాలనీ, ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు. తీరప్రాంత మండలాలలో సహాయక చర్యల కోసం ప్రత్యేక అధికారిని నియమించారు. అన్ని శాఖల అధికారులూ ఆర్టీజీఎస్ కు అసుసంధానం కావాలని సూచించారు.

SHARE