విఫలప్రయోగం : చంద్రబాబు

తెరాస అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెబుతున్న ఫెడరల్ ఫ్రంట్ విఫల ప్రయోగంగా మిగిలిపోక తప్పదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వేరు మిగిలిన రాష్ట్రాలు వేరని ఆయన అన్నారు. పార్టీ సీనియర్ నాయకులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్ లో ఆయన మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ విజయం సాధించిన విషయాన్ని ప్రస్తావించారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికలలో మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్, మిగిలిన రెండు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలూ విజయం సాధించాయన్న చంద్రబాబు తెలంగాణ ఫలితాలతో మిగిలిన రాష్ట్రాల ఫలితాలను పోల్చడానికి లేదని అభిప్రాయపడ్డారు. దేశంలో బీజేపీ పాలనను జనం వ్యతిరేకిస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు చాటింది అదేనని విశ్లేషించారు. కేసీఆర్ చెబుతున్న తరహా కూటమి బీజేపీకే ప్రయోజనం చేకూరుస్తుందని చంద్రబాబు అన్నారు. బీజేపీపై పోరాటానికి కేసీఆర్ కలిసి రాలేదని విమర్శించారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ సహా అన్ని పార్టీలూ కలవాలని పేర్కొన్నారు.