శ్రీకాకుళంలో తెలుగుదేశం ధర్మపోరాట దీక్ష నేడు

కేంద్ర ప్రభుత్వం  ఏపీకి చేసిన అన్యాయనికి నిరసనగా తెలుగుదేశం పార్టీ  శ్రీకాకుళంలో నేడు ధర్మ పోరాట దీక్షనిర్వహించనున్నది. విభజన హామీల అమలులో కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా నెలకు ఒక జిల్లా కేంద్రంలో తెలుగుదేశం పార్టీ ధర్మ పోరాట దీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఏపీకి ప్రత్యేక హోదా సహా రైల్వే జోన్, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ, కడప ఉక్కు కర్మాగారం సహా విభజన హామీలను నెరవేర్చడంలో కేంద్రంలోని మోడీ సర్కార్ ఘోరంగా విఫలమైందని తెలుగుదేశం విమర్శిస్తున్నది. కేంద్రం వైఖరికి నిరసనగానే కేంద్ర కేబినెట్ నుంచి తెలుగుదేశం మంత్రులు వైదొలగడంతోపాటు, పార్టీ ఎన్డీయేతో తెగతెంపులు చేసుకున్న సంగతి తెలిసిందే.

నేడు శ్రీకాకుళంలో జరిగే ధర్మ పోరాట దీక్షకు ఏపీ సీఎం చంద్రబాబు, తెలుగుదేశం ఎంపీలు, నేతలు హాజరౌతారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మధ్యాహ్నం ఒంటి గంటలకు శ్రీకాకుళం ఆర్ అండ్ బీ అతిథి గృహానికి చేరుకుంటారు. అనంతరం శ్రీకాకుళంలో పార్టీ జిల్లా కార్యాలయాన్ని ఆయన ప్రారంభిస్తారు. ఆ తరువాత ఇక్కడి కోడి రామ్మూర్తి స్టేడియంలో ఏర్పాటు చేసిన ధర్మ పోరాట దీక్ష సభలో ప్రసంగిస్తారు.

 

SHARE