శ్వేతపత్రాలపై సీపీఎం అక్షేపణ

 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విడుదల చేస్తున్న శ్వేత పత్రాలపై సీపీఎం నేత మధు విమర్శలు గుప్పించారు.  బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న విషయాన్ని ముందు నుంచి వామపక్షాలు చెప్తూనే ఉన్నాయని గుర్తు చేశారు. అప్పుడు బిజెపితో చంద్రబాబు అంటకాగారని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ గతంలో ఇచ్చిన 14 హామీల్లో ఒక్క దానిని కూడా పూర్తిగా నెరవేర్చలేదని విమర్శించారు.

రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలలో ఏడింటికి వైస్ ఛాన్సలర్స్ లేరని మధు అన్నారు. శ్వేతపత్రాల పేరుతో చంద్రబాబు తన బాధ్యతని వేరేవారి మీదకి నెట్టేస్తున్నారని మధు విమర్శించారు. ఈనెల 28న కరువు మండలాలన్నింటిలో బంద్ నిర్వహించబోతున్నామని ఆయన తెలిపారు. రాజధానిలో  అన్ని ప్రయివేటు యూనివర్సిటీలకు ఎందుకు అనుమతిచ్చినట్లని ఆయన  ప్రశ్నించారు. భవిష్యత్‌లో ఎవరూ కూడా చదవలేని పరిస్థితి ఉంటుందని, ఫీజులపై అసలు నియంత్రణ లేదని మధు విమర్శించారు.