సరోగసి బిల్లుకు లోక్ సభ ఆమోదం

సరోగసి బిల్లుకు లోక్ సభ ఆమోదం తెలిపింది. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీనడ్డా ఈ బిల్లును సభలో ప్రవేశ పెట్టారు. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొని ఉన్నప్పటికీ..సభ్యుల నినాదాల మధ్యనే మంత్రి బిల్లును ప్రవేశ పెట్టారు. ఈ బిల్లుపై సభలో చర్చ సందర్భంగా కూడా తీవ్ర గందరగోళ పరిస్థితులే నెలకొన్నాయి.

సభ్యుల అభ్యంతరాలు, నినాదాల మధ్యనే సభ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించింది. కాగా బిల్లులో పలు లోపాలున్నాయంటూ సభ్యులు చెప్పిన అభ్యంతరాలను ఖాతరు చేయకుండా..సమగ్ర చర్చ జరగకుండానే కీలక బిల్లు ఆమోదం పట్ల విపక్ష సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సభను సజావుగా నడపడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. బిల్లును ఆమోదించగానే సభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.