మాజీ మంత్రి జేసికి భారీ షాక్…! వంద కోట్ల జరిమానా..!!

 

అనంతపురం జిల్లా సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జేసి దివాకరరెడ్డికి జగన్ సర్కార్ భారీ షాక్ ఇచ్చింది. ఇంతకు ముందే వాహనాల అక్రమ రిజిస్ట్రేషన్ కేసులో జేసి దివాకరరెడ్డి సోదరుడు ప్రభాకరరెడ్డి, ఆయన కుమారుడు అరెస్టు అయి బెయిల్‌పై విడుదల అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా అక్రమ మైనింగ్ నిర్వహించారంటూ జేసీ దివాకరరెడ్డికి చెందిన సంస్థకు మైనింగ్  శాఖ భారీ జరిమానా విధించింది. త్రిశూల్ సిమెంట్స్ ఫ్యాక్టరీలో జెసి భారీ ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగాలపై సాక్షాధారాలు లభించడంతో వంద కోట్ల రూపాయల జరిమానాను మైనింగ్ శాఖ విధించింది. ఈ జరిమానా కట్టకపోతే ఆర్ అండ్ ఆర్ చట్టం కింద ఆస్తులను జప్తు చేస్తామని మైనింగ్ శాఖ హెచ్చరించింది.

 

అనంతపురం జిల్లా యాడికి మండలం కోన ఉప్పలపాడులో అక్రమ తవ్వకాలు జరిపి దాదాపు  14 లక్షల మెట్రిక్ టన్నుల లైమ్ స్టోన్ నిబంధనలకు విరుద్దంగా విక్రయించారని జేసి సంస్థలపై అభియోగాలను నమోదు చేశారు.  జేసీ తన ఇంట్లో పని చేసే పని మనుషులు, డ్రైవర్‌ల పేర్లతో త్రిశూల్ సిమెంట్స్ కు అనుమతులు పొంది ఆ తరువాత వారి కుటుంబ సభ్యులకు వాటాలను బదలాయింపు చేసుకున్నారని అధికారులు గుర్తించారు.