వికారాబాద్ జిల్లాలో టెన్త్ పరీక్షల తొలి రోజు ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం కలకలం రేపింది. ఈ ఘటనలో పలువురు ఉద్యోగులపై వేటుపడింది. ఈ ఘటన మరువక ముందే తెలంగాణలోనే మరో జిల్లాలో టెన్త్ పరీక్షల విద్యార్ధుల ఆన్ షీట్లు (జవాబు పత్రాల) కట్ట ఒకటి మాయం కావడం సంచలనంగా మారింది. దీంతో విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరులో ఈ ఘటన చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. ఉట్నూరు లో మొత్తం 1011 మంది పదవ తరగతి విద్యార్ధుల కోసం అయిదు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష ముగియగానే విద్యార్ధులు రాసిన ఆన్సర్ షీట్స్ ను ఆయా పరీక్షా కేంద్రాల బాధ్యులు పోస్టాఫీసులో అప్పగించారు. అయితే పోస్టల్ సిబ్బంది ఆన్సర్ షీట్లు అన్ని 11 కట్టలుగా కట్టి ఎన్విజిలేషన్ కేంద్రాలకు తరలించేందుకు గానూ ఆటోలో బస్టాండ్ కు తీసుకువెళ్లారు. బస్సులో వేసే క్రమంలో మరో సారి ఆన్సర్ షీట్ బండిల్స్ ను లెక్కబెట్టడంతో మొత్తం 11కు గానూ పది మాత్రమే ఉండటంతో ఒక్కసారిగా ఆందోళనకు గురైయ్యారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేశారు. వెంటనే పోలీసులు ఆటో వెళ్లిన మార్గంలోని రోడ్లపై వెతికారు. ఎక్కడా ఆన్సర్ షీట్ల బండిల్ కనిపించలేదు. సబ్ పోస్టు మాస్టర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన ఆ పరీక్షా కేంద్రంలో ఎగ్జామ్ రాసిన విద్యార్ధులు ఆందోళన చెందుతున్నారు.