జార్ఖండ్ రాష్ట్రం ధన్ బాద్ లో రాత్రి ఓ అపార్ట్ మెంట్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మంది తీవ్రంగా గాయపడగా, వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘోర ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇది తనను ఎంతగానో కలచివేసిందన్నారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు రూ.50వేల వంతున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు మోడీ.

జోడా పాఠక్ ప్రాంతంలో 400 మంది నివాసం ఉంటున్న 13 అంతస్తుల ఆశీర్వాద్ టవర్ అపార్ట్ మెంట్ లో మంగళవారం రాత్రి మంటలు చెలరేగాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని అయిదు ఫైర్ ఇంజన్ లతో మంటలను అదుపు చేశారు. పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడి ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో 14 మంది మృతి చెందగా, 50 మందికిపైగా గాయపడ్డారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.
ఈ ప్రమాద ఘటనపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. అగ్ని ప్రమాదం కారణంగా ప్రజలు మరణించడం చాలా హృదయ విదారకరంగా ఉందన్నారు. జిల్లా యంత్రాంగం యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టిందని చెప్పారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నామని తెలిపారు. మొత్తం సహాయక చర్యలను తానే స్వయంగా పరిశీలిస్తున్నానని చెప్పారు. మృతుల ఆత్మకు శాంతి చేకూర్చాలనీ, బాధిత కుటుంబాలను ధైర్యం ప్రసాదించాలని భగవంతుడిని కోరుకుంటున్నానన్నారు. క్షతగాత్రులకు సత్వర వైద్యం అందించేందుకు అన్ని విధాలు కృషి చేస్తున్నామని తెలిపారు.