ఎంపీలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా కాంగ్రెస్

మధ్యప్రదేశ్ లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా కాంగ్రెస్ వేగంగా అడుగులు వేస్తున్నది. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో ఏకైక పెద్ద పార్టీగా అవతరించినప్పటికీ 230 స్థానాలున్న అసెంబ్లీలో అధికారం చేపట్టేందుకు అవసరమైన 115 స్థానాలు సాధించడంలో కాంగ్రెస్ విఫలమైంది. మ్యాజిక్ ఫిగర్ కు ఒకే ఒక్క సీటు దూరంలో నిలిచింది.

కాగా బీఎస్పీ, ఎస్పీ సభ్యులు కాంగ్రెస్ కు మద్దతు ఇస్తామని ప్రకటించడంతో కాంగ్రెస్ మధ్యప్రదేశ్ లో అధికారం చేపట్టేందుకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గవర్నర్ ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు తమ పార్టీని ఆహ్వానించాల్సిందిగా కోరాయి. పార్టీ లెజిస్లేచర్ పార్టీ నేతను ఈ రోజు ఎన్నుకోనున్నారు. కేంద్రం దూతల సమక్షంలో ఎంపీ సీఎల్పీ నాయకుడి ఎన్నిక జరుగుతుంది. తమలో అధిష్టానం సీఎంగా ఎవరిని నిర్ణయించినా అభ్యంతరం లేదని ఇప్పటికే సీఎల్పీ ప్రకటించిన సంగతి తెలిసిందే.