సూరి హత్య కేసు- భానుకిరణ్ కు యావజ్జీవం

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్దెల చెర్వు సూరి హత్య కేసులో భాను కిరణ్ ను దోషిగా నిర్ధారించిన కోర్టు ఆయనకు జీవిత ఖైదు విధించింది. తెలుగుదేశం నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి హత్యకు సూత్ర ధారి మద్దెల చెర్వు సూరిని అతడి సహచరుడు భాను కిరణ్ పాయింట్ బ్లాంక్ లో కాల్చి చంపిన సంఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ కేసుకు సంబంధించి కోర్టు నేడు తీర్పు వెలువరించి శిక్షలు ఖరారు చేసింది. భాను కిరణ్ కు జీవితఖైదు విధించిన న్యాయస్థానం, మరో నలుగురిని నిర్దోషులుగా ప్రకటించింది. అలాగే మన్మోహన్ సింగ్ అనే వ్యక్తికి ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.

ఈ తీర్పుపై స్పందించిన సూరి భార్య భానుమతి…తన భర్తను హత్య చేసిన భాను కిరణ్ కు కోర్టు ఉరిశిక్ష వేసి ఉంటే మరింత సంతోషించేదానినని పేర్కొంది. భాను కిరణ్ కు మరణశిక్ష పడితేనే  సూరి ఆత్మకు శాంతి కలుగుతుందని పేర్కొంది. మద్దెల చెర్వు సూరి హత్య కేసు విచారించిన నాంపల్లి ప్రత్యేక కోర్టు ఈ రోజు తీర్పు వెలువరించింది.  ఈ కేసులో ప్రధాన నిందితుడు భాను కిరణ్ కు యావజ్జీవ శిక్షతో పాటు రూ. 20 వేలు జరిమానా విధించింది. ఇదే కేసులో మన్మోహన్ సింగ్ కు ఐదేళ్ల జైలు, రూ.5 వేలు జరిమానా విధించింది.  2011లో జరిగిన సూరి హత్యకేసు అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణ ఏడేళ్లు సాగింది.