దేశంలో కొందరికే స్వేచ్ఛ: నసీరుద్దీన్ షా

దేశంలో కొందరు వ్యక్తులకు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఉందని ప్రసిద్ధ నటుడు నసీరుద్దీన్ షా అన్నారు. యూట్యూబ్ వీడియో సందేశంలో ఆయన దేశంలోని కొన్ని ప్రాంతాలలో పోలీసుల ప్రాణాల కంటే…గో రక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఉందని అన్నారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి చూస్తుంటే తన పిల్లల భవిష్యత్ పట్ల ఆందోళన కలుగుతోందని అన్నారు. తన పిల్లలకు ఎటువంటి మతపరమైన విద్యనూ తాను అందించలేదని పేర్కొన్నారు. మంచి, చెడులకు మతంతో సంబంధం లేదని తాను భావించాననీ, అందుకే తన పిల్లలను మతపరమైన విద్యకు దూరంగా ఉంచానని అన్నారు. అయితే ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితులను చూస్తుంటే వారి భవిష్యత్ పట్ల భయం కలుగుతోందని అన్నారు. మన పిల్లలకు మనం మంచి, చెడుల గురించి నేర్పామే తప్ప,  మన మత విశ్వాసాలేమిటన్నది నేర్పలేదన్నారు. రేపు వారిని మూకలు చుట్టుముట్టి మీరు హిందువా, ముస్లిమ్ వా అని అడిగితే వారి వద్ద జవాబు ఉండదన్నారు. దేశంలో ద్వేషపూరిత వాతావరణాన్ని కల్పించడం కోసం ఉద్దేశ పూర్వకంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితి సమీప భవిష్యత్ లో మెరుగుపడే పరిస్థితిక కనిపించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.