620 కిలో మీటర్ల విమెన్ వాల్!

శబరి మల అయ్యప్ప ఆలయంలోనికి మహిళల ప్రవేశానికి అనుమతి ఇస్తూ సుప్రీం కోర్టు తీర్పును అమలు చేయాలన్న డిమాండ్ తో, అలాగే సుప్రీం తీర్పును అమలు చేయాలని భావిస్తున్న కేరళ ప్రభుత్వానికి మద్దతుగా మహిళలు 620 కిలోమీటర్ల మేర మానవహారంగా ఏర్పడ్డారు. దీనికి విమెన్ వాల్ గా వారు అభివర్ణిస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీలకు చెందిన మహిళా నేతలు, వివిధ వర్గాలకు చెందిన మహిళలు, మహిళా హక్కుల సంఘాల కార్యకర్తలు, నేతలు ఈ మానవ హారంలో పాల్గొన్నారు. సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ ఈ మానవహారాన్ని తిరువనంతపురంలోని వెల్లాయంబల్ వద్ద ప్రారంభించారు. మహిళా సముద్రం ఉప్పొంగిందా అన్నట్లుగా పెద్ద సంఖ్యలో మహిళలు ఈ మానవహారంలో భాగస్వాములయ్యారు.

పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, మహిళలపై వివక్షను నిరసిస్తూ మహిళలు ఈ మహా మానవహారంలో భాగస్వాములయ్యారు. తిరువనంతపురంలోని వెల్లాయంబలం వద్ద ఆరంభమైన ఈ మానవహారం కసర్ గోడ్ వరకూ సాగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలనూ కలుపుతూ దాదాడు 620 కిలోమీట్ల మేర మహిళలు మానవహారంగా ఏర్పడ్డారు. ఈ మానవహారంలో దాదాపు 50లక్షల మంది మహిళలు భాగస్వాములయ్యారు.సుప్రీం తీర్పును విభేదిస్తున్న వారికి వ్యతిరేకంగా మహిళా సముద్ర గర్జనగా ఈ విమెన్ వాల్ ను కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ అభివర్ణించారు.