కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో భారత్ జోడో యాత్ర కర్ణాటకలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ చేపట్టిన పాదయాత్ర గురువారం 29వ రోజుకు చేరుకుంది. తన కుమారుడు రాహుల్ గాంధీ చేస్తున్న పాదయాత్రలో గురువారం కాంగ్రెస్ పార్టీ అధినేత్ర సోనియా గాంధీ పాల్గొన్నారు. కర్ణాటకలోని మాండ్యలో రాహుల్, ఇతర నేతలతో కలిసి సోనియా పాాదయాత్ర చేశారు. రాహుల్ పాదయాత్రలో పాల్గొనేందుకు సోమవారమే మైసూర్ చేరుకున్న సోనియా గాంధీ.. విజయదశమి రోజు (బుధవారం) బేగర్ గ్రామంలోని భీమనకొళ్లి మహాదేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. గురువారం మండ్యకు చేరుకుని పాదయాత్రలో పాల్గొన్నారు.

75 సంవత్సరాల సోనియా గాంధీ పాదయాత్రలో నేతలతో కలిసి ఉత్సాహంగా పాల్గొన్నారు. సోనియా నడక సాగిస్తున్న క్రమంలో కాళ్లు నొప్పి పెడతాయి అంటూ రాహుల్ తన తల్లిని ఒకటి రెండు సార్లు వారించి కారులో కూర్చోవాలని సూచించారు. అయినా సోనియా ఫరవాలేదంటూ నడక సాగించారు. కొద్ది దూరం నడిచిన తర్వాత రాహుల్ తన తల్లి సోనియా నడకను ఆపించి కారులో ఎక్కించారు. తర్వత రాహుల్ యాత్రను కొనసాగించారు. పార్టీ అధినేత్రి సోనియ గాంధీ కర్ణాటకలో పాదయాత్ర చేసేందుకు రావడం తమకు గర్వకారణమని పేర్కొన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డికే శివకుమార్. విజయ దశమి తర్వాత కర్ణాటకలో తమ పార్టీకి విజయం తధ్యమని, బీజేపీ దుకాణం మూతపడుతుందని జోస్యం చెప్పారు.

బీజేపీ విచ్చిన్నకర రాజకీయాలపై పోరాడేందుకు, ఆర్ధిక అసమానతలు, రాజకీయ శక్తి కేంద్రీకరణతో పొంచి ఉన్న ముప్పు పట్ల ప్రజలను చైతన్యపరిచేందుకు రాహుల్ నేతృత్వంలో జోడో యాత్ర చేస్తున్నామని కాంగ్రెస్ చెబుతోంది. రాహుల్ పాదయాత్రలో ప్రజలకు అభివాదం చేస్తూ సామాన్య ప్రజానీకంతో ముచ్చటిస్తూ ముందుకు సాగుతున్నారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు ఆయనను అనుసరిస్తున్నారు.
బెంగళూరు బీమనకొల్లి మహాదేశ్వరాలయంలో సోనియా ప్రత్యేక పూజలు