స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశ వ్యాప్తంగా అట్టహాసంగా సాగుతున్నాయి. ఇంతకు ముందు స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భాల్లో వాడవాడలా రెపరెపలాడిన మువ్వన్నెల జెండా నేడు కేంద్ర ప్రభుత్వ పిలుపుతో ప్రతి ఇంటా రెపరెపలాడుతోంది. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పార్టీ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వాడవాడలా జాతీయ జెండాలను ఆవిష్కరించిన ప్రజా ప్రతినిధులు, నేతలు, ప్రముఖులు సందేశాలను ఇచ్చారు. స్వాతంత్య్ర సముపార్జనలో అమరుల త్యాగాలను స్మరించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్ పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వివిధ శాఖల శకటాల ప్రదర్శనను వీక్షించిన సీఎం జగన్ సందేశం ఇచ్చారు.
స్వాతంత్య్ర పోరాటానికి నిలువెత్తు రూపం జాతీయ జెండా అని, పింగళి వెంకయ్య రూపొందిన జాతీయ జెండా.. భారతీయుల గుండె అని సీఎం జగన్ పేర్కొన్నారు. జాతీయ జెండా మన సాతంత్య్రానికి, అతి పెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీక, సార్వభౌమత్వానికి, ఏకత్వానికి, దేశ భక్తికి , మన ఆత్మగౌరవానికి ప్రతీక అని అన్నారు. వాదాుల వేరు అయినా దేశ స్వాతంత్య్రం గమ్యంగా పోరాడారనీ, ఆనాడి యోధులను స్మరించుకుంటూ హాట్సాఫ్ చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సందర్భంగా ప్రజా సంక్షేమం, వివిధ వర్గాల అభివృద్ధి రాష్ట్ర ప్రగతి కోసం ప్రభుత్వం చేసిన, చేస్తున్న కృషిని వివరించారు. పోలీస్ పరేడ్ గ్రాండ్ లో వంద మీటర్ల ఎత్తులో జాతీయ జెండాను ఎగురవేశారు. ప్రత్యేక వాహనంలో ఉంచిన జాతీయ జెండాను అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది ఎగురవేశారు. సీఎం వైఎస్ జగన్ పాల్గొన్న వేడుకల్లో ఈ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని తెలంగాణ సీఎం కేసిఆర్.. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం సీఎం ప్రసంగించారు. ప్రతి భారతీయుడి హృదయం ఉప్పొంగే సమయం ఇదని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 1.25 కోట్ల జెండాలను ప్రతి ఇంటికి చేర్చామని, రాష్ట్రం త్రివర్ణ శోభితం గా విరాజిల్లుతోందని చెప్పారు. మహనీయుల త్యాగాలను ఈ సందర్బంగా గుర్తు చేశారు. రాష్ట్రంలో వివిధ రంగాల ప్రగతి, వివిధ వర్గాల ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న కృషిని సీఎం కేసిఆర్ వివరించారు. అంతకు ముందు ప్రగతి భవన్ లో సీఎం కేసిఆర్ .. జెండా ఆవిష్కరించారు.