Eluru: ఏలూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. వివాహితపై గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి సమయంలో యాసిడ్ తో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనలో ఆమె చూపు కోల్పోయినట్లు తెలుస్తొంది. వివరాల్లోకి వెళితే.. ఏలూరు విద్యానగర్ కు చెందిన యడ్ల ప్రాంచిక(35) భర్త ఆంజనేయులుతో ఏడాది క్రితం వచ్చిన గొడవల కారణంగా తన అయిదేళ్ల చిన్నారితో సహా పుట్టింటిలో ఉంటోంది. భర్త ఆంజనేయులు రాజమండ్రిలో తల్లిదండ్రులతో ఉంటున్నాడు. రెండు నెలల క్రితం విద్యానగర్ లో ఓ డెంటల్ క్లినిక్ లో రిసెప్షనిస్ట్ గా చేరి విధులను నిర్వహిస్తొంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి విధులు ముగించుకుని స్కూటీపై ఇంటికి వెళుతుండగా ఇంటి సమీపంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మోటారు బైక్ పై వచ్చి ప్రాంచికాపై యాసిడ్ తో దాడి చేశారు. ఆమె కేకలు వేస్తూ సమీపంలోని ఇంటికి వెళ్లింది.

వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఏలూరు ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఆమె రెండు కళ్లు చూపు కోల్పోయినట్లుగా గుర్తించారు. విషయం తెలిసి ఆసుపత్రికి చేరుకున్న డీఐజీ అశోక్ కుమార్, ఎస్పీ మేరీ ప్రశాంతి, ఎఎస్పీ లు బాధితురాలి నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితురాలిని మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు అధికారులు స్పందిస్తూ ఈ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను పట్టుకుంటామని తెలిపారు. డీఎస్పీ, నగరంలోని సీఐలు, ఎస్ఐలు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. అనంతరం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ ఘటన పట్టణంలో తీవ్ర కలకలాన్ని రేపింది.