శ్రీకాకుళం ఆర్టీసీ డిఇపై ఎసిబి దాడి

శ్రీకాకుళం, డిసెంబరు24:ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల కారణంగా శ్రీకాకుళం ఆర్టీసీ డిఇ బమ్మిడి రవికుమార్ ఇంటిపై అవినీతి నిరోధకశాఖ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఏకకాలంలో తొమ్మిది చోట్ల సోదాలు నిర్వహిస్తున్న ఎసిబి అధికారులు,జిల్లాలోని పలాస, మందస, పూండిలో (మూడు చోట్ల) గొప్పిలి, శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో (మూడు చోట్ల) విజయనగరం లోని ఆయన కార్యాలయంలో ఏక కాలంలో దాడులు చేపట్టారు. ఆయన స్నేహితులు బందువులు అయిన పలాస డిపో మేనేజర్ పెంట శివకుమార్ ఇంట్లో, పలాస లోని ఆయన బంధువులు డాక్టర్ కోదండరావు, లీలా కుమారి, హనుమంతు అమరసింహం ఇళ్లల్లో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈదాడుల్లో పెద్ద మొత్తంలో ఇళ్ల స్థలాల దస్త్రాలు, ఫ్లాట్ లు, నగదు, ఆభరణాలు స్వాధీనం చేసుకున్న ఎసిబి అధికారులు ఇంకా తనిఖీలను కొనసాగిస్తున్నారు.