న్యూస్

బిగ్ బుల్ రాకేశ్ ఝున్ ఝన్ వాలా ఇకలేరు

Share

ప్రముఖ వ్యాపారవేత్త, దిగ్గజ పెట్టుబడిదారు రాకేశ్ ఝున్ ఝన్ వాలా (62) హఠాన్మరణం చెందారు. ఈ రోజు ఉదయం ముంబాయిలోని ఓ ఆసుపత్రిలో ఆయన కన్నుమూశారు. ఉదయం ఆయనకు గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు ముంబాయిలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారని వైద్యులు ప్రకటించారు. కిడ్నీ సంబంధిత సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన కొద్ది వారాల క్రితమే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. అంతలోనే ఆయన మరణ వార్త పారిశ్రామిక వేత్తలను దిగ్బాంతికి గురి చేసింది.

 

రాకేశ్ ఝన్ ఝున్ వాలా ఆస్తి విలువ 5.8 బిలియన్లు (రూ.46వేల కోట్లు). ఇందులో సింహ భాగం ఆయన స్టాక్ మార్కెట్ ద్వారానే సంపాదించారు. వారెన్ బఫేట్ ఆఫ్ ఇండియా అని కూడా ఆయనను పిలుస్తుంటారు. హైదరాబాద్ లోని రాజస్థానీ కుటుంబంలో 1960 జూలై 5న జన్మించిన ఆయన .. ముంబాయిలో పెరిగారు. వీరి పూర్వికులది రాజస్థాన్ లోని ఝున్ జునూ. ఝున్ ఝున్ వాలా తండ్రి ఆదాయ పన్ను శాఖలో కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించారు. సెడెన్హమ్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేసిన రాకేశ్ ..అనంతరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో రిజిస్టర్ అయ్యారు. స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ గా ఝున్ ఝున్ వాలా అందరికీ సుపరిచితులు. భారత స్టాక్ మార్కెట్లపై సానుకూల దృక్పదంతో వ్యవహరించే వారు. బుల్ మార్కెట్ ను విశ్వసించే వారు. ఆయన కొనుగోలు చేసిన షేర్లలో చాలా వరకు కాసుల వర్షం కురిపించాయి. ఆర్ఏఆర్ఈ ఎంటర్ ప్రైజెస్ పేరుతో ప్రైవేటు స్టాక్ ట్రేడింగ్ కంపెనీని నడిపారు ఝున్ ఝున్ వాలా.

రాకేశ్ ఝున్ ఝున్ వాలా ఆకాశ ఎయిర్స్ తో ఇటీవలే విమాన యాన రంగంలో అడుగు పెట్టారు. తొలి విమానం ఈ నెల 7న సేవలు ప్రారంభించింది. ఈ ఏయిర్ లైన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన వైల్ చైర్ పై కనిపించారు. రాకేశ్ ఝున్ ఝున్ వాలా ఇన్వెస్టర్ గానే కాకుండా యాప్ చెక్ లిమిటెడ్, హంగామా డిజిటల్ మీడియా, ఎంటర్ టైన్ మెంట్ ప్రైవేటు లిమిటెడ్ చైర్మన్ గానూ బాధ్యతలు నిర్వహించారు. అంతే కాకుండా పలు సంస్థలకు డైరెక్టర్ గానూ వ్యవహరించారు. ఇంటర్నేషనల్ మూవ్ మెంట్ టు యునైట్ నేషన్స్ కు భారత సలహాదారుగానూ ఉన్నారు. రాకేశ్ కు ధాతృత్వం కూడా ఎక్కువే. తన సంపాదనలో 25 శాతం విరాళంగా ఇస్తున్నారు. హెల్త్ కేర్, న్యూట్రిషన్, ఎడ్యుకేషన్ వంటి వాటికి విరాళాలు అందించారు.

రాకేశ్ ఝున్ ఝున్ వాలా మృతి పట్ల ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ వేదికగా సంతాపం తెలియజేశారు. ఆయన మరణం భాధాకరమని పేర్కొన్నారు. కుటుంబ సభ్యులకు, అభిమానులకు మోడీ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.


Share

Related posts

ఎంఫార్మసీ చేయాలనుకుంటున్నారా…ఈ విషయాలు తెలుసుకోండి..

bharani jella

తెలంగాణలో ఏమి జరుగుతోంది..?

somaraju sharma

లక్ష రూపాయల కోసం స్వంత కిడ్నప్ డ్రామా.. చివరికి?

Teja