టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొనేందుకు కుప్పం వచ్చిన సినీ నటుడు నందమూరి తారకరత్న గుండె పోటుకు గురైన సంగతి తెలిసిందే. కుప్పం మసీదులో ప్రార్ధనలు అనంతరం బయటకు వస్తున్న సమయంలో తారకరత్న ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. తొలుత క్రౌడ్ మూలంగా ఒత్తిడికి గురై సొమ్మసిల్లి పడిపోయారని భావించారు. వెంటనే ఆయన వ్యక్తిగత సిబ్బంది సమీపంలోని కేసీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు తారకరత్న హార్ట్ స్టోక్ గురైనట్లు గుర్తించారు. వెంటనే ఆయనకు సీపీఆర్ నిర్వహించారు. అనంతరం పీఈఎస్ ఆసుపత్రికి మార్చారు. ఐసీయూలో ఉంచి తారకరత్నకు వైద్యం నిర్వహించారు. హుటాహుటిన బాలకృష్ణ అక్కడకు చేరుకుని తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు విషయం తెలిసిన వెంటనే బాలకృష్ణకు ఫోన్ చేసి తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. వైద్యులతో మాట్లాడారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలించాలని భావించారు. అయితే ఎయిర్ లిఫ్ట్ కి అవకాశం లేకపోవడంతో రోడ్డు మార్గాన తారకరత్నను బెంగళూరుకు తరలించాల్సిన పరిస్థితి నెలకొంది.

అయితే తరలించే క్రమంలో మరో సారి హార్ట్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు ఉండటంతో బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రి నుండి వైద్య నిపుణుల బృందం పీఈఎస్ ఆసుపత్రికి పిలిపించారు. అయిదుగురు సభ్యులతో కూడిన వైద్య బృందం ఆయన్ను పర్యవేక్షిస్తున్నారు. నిన్న రాత్రి పాదయాత్ర ముగిసిన తర్వాత నారా లోకేష్ ఆసుపత్రికి చేరుకుని బాలకృష్ణతో కలిసి ఐసీయూలోకి వెళ్లి తారకరత్నను చూసి వైద్యులతో మాట్లాడారు. శుక్రవారం అర్ధరాత్రి తారకరత్నను బెంగళూరు తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. రాత్రి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి, కుమార్తె కుప్పం ఆసుపత్రికి చేరుకున్నారు. ఆమె అనుమతితో వైద్యులు ప్రత్యేక అంబులెన్స్ లో బెంగళూరు హృదయాలయ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. మరో 48 గంటల వరకు ఏమీ చెప్పలేని పరిస్థితి ఉందని వైద్యులు తెలిపినట్లు సమాచారం. గుండె ఎడమ వైపు వాల్వ్స్ 90 శాతం వరకు బ్లాక్ అయ్యాయి. ఆ కారణంగా హార్ట్ అటాక్ బారినపడ్డారని వైద్యులు చెబుతున్నారు. తారకరత్న అస్వస్థతకు గురి కావడంపై టీడీపీ కార్యకర్తలు, అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన తిరిగి కోలుకోవాలని ప్రార్ధిస్తున్నారు.
రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలని తారకరత్న భావిస్తున్నారు. ఆ క్రమంలో పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. లోకేష్ తో కలిసి యువగళం పాదయాత్ర ఏర్పాట్లపై గత కొద్ది రోజులుగా తారకరత్న తలమునకలై ఉన్నారు. నిన్న లోకేష్ పాదయాత్ర ప్రారంభమైన కొద్దిసేపటికే తారకరత్న ఒక్క సారిగా కుప్పకూలిపోయారు. బెంగళూరు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్నను చూసేందుకు ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు ఈవేళ బెంగళూరుకు చేరుకోనున్నారని సమాచారం. బాలకృష్ణకు నిన్న ఎన్టీఆర్ ఫోన్ చేసి తారకరత్న ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
Breaking: లోకేష్ పాదయాత్రలో అపశృతి ..సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్న