పవర్ స్టార్ సినిమా అంటే ప్రేక్షకుల్లో, ఫ్యాన్స్ లో మొదలయ్యే ఆనందం.. ఊపు.. ఉత్సాహం ఎలా ఉంటుందో ఏ ఒక్కరు మాటల్లో చెప్పలేరు. అలాంటిది సినిమాలు చేయను అనగానే అందరూ చాలా డిసప్పాయింట్ అయ్యారు. కాని అనూహ్యంగా మళ్ళీ వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. అలాగే రీసెంట్ గా తన తర్వాత సినిమాలని అధికారకంగా ప్రకటించారు. ఈ సినిమాల ప్రకటనలన్ని చూసిన మెగా ఫ్యాన్స్ కి, ప్రేక్షకులందరికి మామూలు ఉత్సాహం కలగలేదు.
ఇక పవర్ స్టార్ ప్రకటించిన సినిమాలన్ని ఒక్కొక్కటిగా 2021 లోనే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. దాంతో 2021 ‘ పవన్ ‘ నామ సంవత్సరం కాబోతుందని అభిమానులు చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం పవర్ స్టార్ నటిస్తున్న వకీల్ సాబ్ కి పవన్ నటించాల్సిన సీన్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉండటంతో ముందు ఈ సీన్స్ కంప్లీట్ చేసి డిసెంబర్ మూడవ వారం లో లేదా 2021 సంక్రాంతి బరిలో దింపాలని దిల్ రాజు గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఇక గబ్బర్ సింగ్ కాంబినేషన్ అయిన హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ లతో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న సినిమాని ఈ ఏడాది డిసెంబర్ లో చిత్రీకరణ మొదలు పెడతారని తాజా సమాచారం. నాన్ స్టాప్ గా చిత్రీకరణ జరిపి 2021 సమ్మర్ లో రిలీజ్ చేసేందుకు దర్శకుడు హరీష్ శంకర్ సన్నాహాలు చేస్తున్నాడట. ఇప్పటికే మొదలైన క్రిష్, పవన్ కళ్యాణ్ సినిమా 2021 జనవరి నుంచి మళ్ళీ సెట్స్ మీదకి తీసుకు వెళ్ళబోతున్నట్టు సమాచారం. అన్ని అనుకున్నట్టు పూర్తయితే విజయదశమి పండుగ సందర్భంగా రిలీజ్ చేసే అవకాశాలున్నాయట. ఇక ఈ సినిమాకి విరూపాక్ష అన్న టైటిల్ ప్రచారం లో ఉంది.
ఈ సినిమాలతో పాటు సురేందర్ రెడ్డి సినిమా కూడా 2021 లోనే రిలీజ్ కాబోతుందని అంటున్నారు. దాదాపు స్క్రిప్ట్ పూర్తయిందట. పవన్ కళ్యాణ్ డేట్స్ సర్దుబాటు చేస్తే ఈ సినిమాని 2021 లో షూటింగ్ మొదలు పెట్టి డిసెంబర్ లోపు రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎస్.ఆర్.టి. ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రాం తాళ్ళూరి ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. మొత్తానికి 2021 మొత్తం పవర్ స్టార్ దే. ఇది ఫ్యాన్స్ కి పెద్ద గుడ్ న్యూసే.