సుశాంత్ మృతి విషయం ఏమోగానీ అతని అభిమానుల్లో మాత్రం రోజు రోజుకీ తీవ్రమైన ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతున్నాయి. బాలీవుడ్లో ప్రముఖ దర్శక నిర్మాతలు, వారి సంతానానికి సుశాంత్ ఫ్యాన్స్ చుక్కలు చూపిస్తున్నారు. వారి ధాటికి పలువురు స్టార్లు దెబ్బకు తమ సోషల్ ఖాతాలనే క్లోజ్ చేశారు. ఇక తాజాగా మహేష్ భట్ కుమార్తె, నటి ఆలియా భట్‌కు సుశాంత్ ఫ్యాన్స్ సెగ తగిలింది.
ఆలియా భట్ నటించిన తాజా చిత్రం సడక్ 2 త్వరలో డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రానికి ఆలియా తండ్రి మహేష్ భట్ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా కూడా వారి నిర్మాణంలోనే వస్తోంది. ఇక ఈ సినిమా ట్రైలర్‌ను మంగళవారం విడుదల చేయగా.. ఇప్పటికే 64 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది. అయినప్పటికీ దీన్ని లైక్ చేసిన వారి కంటే డిస్లైక్ చేసిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంది.
సాధారణంగా యూట్యూబ్‌లో ఏదైనా వీడియోకు లైక్‌లు ఎక్కువగా, డిస్‌లైక్‌లు తక్కువగా ఉంటాయి. కానీ సడక్ 2 మూవీ ట్రైలర్‌కు మాత్రం వ్యతిరేకంగా జరుగుతోంది. ఈ మూవీకి డిస్లైక్లే ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు దీన్ని 58వేల మందికి పైగా లైక్ చేయగా.. 3.60 లక్షల మంది డిస్లైక్ చేశారు. దీన్ని బట్టి చూస్తే సుశాంత్ ఫ్యాన్స్ ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఇట్టే అర్థమవుతుంది. కాగా ఈ మూవీ ఈ నెల 28న హాట్‌స్టార్ యాప్‌లో స్ట్రీమింగ్ కానుంది.